
తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 35 మండలాల పరిధిలోని 777 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 7,210 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే వివిధ కోర్టు కేసుల కారణంగా 30 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నాయి.
మొదటి విడతలో జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఉన్న 415 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఈ మండలాల్లో ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
రెండో విడతలో చంద్రగిరి తిరుపతి రూరల్ సహా మొత్తం 17 మండలాల్లోని 362 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మండలాల్లో ఈ నెల 29వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.
రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.
