డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ బ్లో అవుట్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాద తీవ్రత ప్రభావిత ప్రాంతాల పరిస్థితి ప్రజల భద్రతకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు జిల్లా కలెక్టర్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను ఇప్పటికే నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఓఎన్జీసీకి చెందిన ప్రత్యేక సాంకేతిక బృందం ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు. మరో ఐదు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఓఎన్జీసీ భద్రతా చర్యలపై సేఫ్టీ ఆడిట్‌కు ఆదేశాలు

ఇటీవల కాలంలో వరుసగా గ్యాస్ లీకేజీ బ్లో అవుట్ ఘటనలు చోటుచేసుకుంటుండటంపై పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదం తీవ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

ప్రజల ప్రాణాలు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సహాయక చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *