అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు. రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులను స్మరించుకుంటూ ఎక్స్‌ వేదికగా ప్రత్యేక సందేశం పోస్టు చేశారు.

ఈ రోజు మనం సంరక్షిస్తున్న అడవులు భావితరాలకు అందించాల్సిన అమూల్యమైన వారసత్వమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వాటి పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ సిబ్బంది సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. వారి త్యాగం కాలగర్భంలో కలిసిపోని చిరస్మరణీయ వారసత్వమని అభివర్ణించారు.

అడవులు, వన్యప్రాణులు, రాష్ట్ర సహజ సంపదను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న అటవీ అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆయన వందనం తెలిపారు. ఎన్నో సవాళ్లు ప్రమాదకర పరిస్థితుల మధ్య విధులు నిర్వర్తిస్తున్న వారి సేవలను ప్రశంసించారు. అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమం, గౌరవానికి సమాజమంతా ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

అడవులే మన వారసత్వమని వాటిని కాపాడే అటవీ సిబ్బందే నిజమైన వీరులని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భద్రత సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *