
దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు బయలుదేరారు. నక్సలిజం తీవ్రవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా దళాల సిబ్బందితో కలిసి ఆయన పండుగ సంబరాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
గతంలో నక్సలిజం ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన బస్తర్ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు శాంతి నెలకొందని తెలిపారు.
దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు బస్తర్‌కు వెళ్తున్నట్లు వెల్లడించిన ప్రధాని నక్సలిజాన్ని ఎదుర్కొంటూ విధులు నిర్వర్తించిన ధైర్యవంతులైన భద్రతా సిబ్బందిని అభినందించారు. దేశ రక్షణ కోసం వారు చేసిన త్యాగాలు, నిస్వార్థ సేవ, దేశం పట్ల చూపుతున్న అచంచలమైన అంకితభావానికి సెల్యూట్ చేసేందుకే వారితో కలిసి పండుగ జరుపుకోనున్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా బస్తర్‌లో గత ఏడాది కాలంగా తీవ్రవాదానికి సంబంధించి ఎలాంటి మరణాలు నమోదు కాకపోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. 2025 అక్టోబర్ 30న ఈ ప్రాంతంలో చివరి మరణం నమోదైనట్లు పేర్కొంటూ తీవ్రవాద నిర్మూలన కోసం కృషి చేసిన భద్రతా బలగాల సేవలను ప్రశంసించారు.
ప్రతి ఏడాది దీపావళి పండుగను దేశ సరిహద్దుల్లో విధుల్లో ఉన్న సైనికులతో కలిసి జరుపుకోవడం ప్రధాని మోదీకి ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బస్తర్‌లో భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన పయనమయ్యారు.
