
ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర’కు కొనసాగింపుగా వచ్చిన ‘పొలిమేర 2’ కూడా థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. చేతబడి, క్షుద్రపూజలు, మిస్టరీ, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘పొలిమేర 3’ను ఈసారి పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘విరావి’గా అర్జున్ సర్జా.. అదిరిపోయిన ఫస్ట్ లుక్!
తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ఆధ్యాత్మికత, భయం కలగలిసిన వాతావరణాన్ని చూపించారు. పాడుబడిన ఆలయం, అమావాస్య చీకట్లు, విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలు, అనంత పద్మనాభస్వామి దర్శనంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథలోని చీకటి కోణాన్ని పరిచయం చేస్తూ క్షుద్రపూజల సన్నివేశాలను చూపించారు.
ఓవైపు కొమరయ్య పాత్రలో సత్యం రాజేశ్ తనదైన శైలిలో క్షుద్రపూజలు చేస్తుండగా.. మరోవైపు చేతిలో పదునైన కత్తి పట్టుకుని యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఎంట్రీ ఇస్తారు. ‘విరావి’ అనే శక్తిమంతమైన పాత్రలో ఆయన గంభీరమైన లుక్, హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఈసారి కొమరయ్య క్షుద్రపూజలకు అడ్డుకట్ట వేసే యోధుడిగా అర్జున్ కనిపించబోతున్నారా? అనే ఆసక్తిని గ్లింప్స్ కలిగిస్తోంది.
భారీ స్థాయిలో ‘పొలిమేర 3’ నిర్మాణం
డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్) సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వంశీ నందిపాటి, భరత్ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మొదటి రెండు భాగాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఫ్రాంచైజీని ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ‘పొలిమేర 3’ను మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.
పాత పాత్రలతోనే సత్యం రాజేశ్ అండ్ టీమ్
ఈ సినిమాలో గత రెండు భాగాల్లో కనిపించిన పలువురు నటీనటులు తమ పాత పాత్రలతోనే తిరిగి సందడి చేయనున్నారు. సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, కృష్ణ ప్రసాద్ నేపథ్య సంగీతం గ్లింప్స్‌లోని ఉత్కంఠభరిత వాతావరణానికి మరింత బలాన్ని చేకూర్చాయి. ఇటీవల ‘బ్లాస్ట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అర్జున్ సర్జా.. ఇప్పుడు మిస్టిక్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషిస్తుండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
కొమరయ్య వర్సెస్ విరావి.. పోరు ఆసక్తికరం!
ఇప్పటివరకు విడుదలైన రెండు భాగాల్లో కొమరయ్య చుట్టూ తిరిగిన కథ.. మూడో భాగంలో మరింత ఉత్కంఠభరితంగా మారనున్నట్లు గ్లింప్స్ సూచిస్తోంది. కొమరయ్య చేసే క్షుద్రపూజలు, వాటిని ఎదుర్కొనే విరావి పాత్ర మధ్య ఎలాంటి సంఘర్షణ చోటుచేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అర్జున్ సర్జా ఎంట్రీతో ‘పొలిమేర 3’పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
