
తిరుపతి జిల్లాలోని ఇల్లెత్తూరు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్‌లో ఎన్నికల ఫలితం మారడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోజా కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తొలుత జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి దేవి 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే టీడీపీ అభ్యర్థి జయప్రద రీకౌంటింగ్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారులు మరోసారి ఓట్లను లెక్కించగా ఫలితం తారుమారైంది. రీకౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి జయప్రద 3 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు ప్రకటించారు.
ఈ ఫలితంపై వైసీపీ అభ్యర్థి దేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని తమకు వచ్చిన ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపి లెక్కించారని వైసీపీ నేతలు ఆరోపించారు. మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు అందుకు అంగీకరించడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులతో రోజా వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ పరిణామాలతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు రోజాను జీపులో పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఇల్లెత్తూరు ఎంపీటీసీ ఫలితం చుట్టూ నెలకొన్న ఈ వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
