
D Spiritual: Nov 13: టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 కోట్ల భారీ విరాళం
తిరుమలలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు కొడాలి శ్రీకాంత్ రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ విరాళాన్ని అందించారు.
ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును కొడాలి శ్రీకాంత్ అందజేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ సేవల కోసం ఇంత భారీ మొత్తంలో విరాళం అందించడం పట్ల అదనపు ఈవో దాతను అభినందించారు.
ఈ సందర్భంగా టీటీడీ అధికారులు కొడాలి శ్రీకాంత్ ఉదారతను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్‌వో మురళీకృష్ణ పాల్గొన్నారు.
