
D Spiritual: Nov 17: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక మండల మకరవిళక్కు తీర్థయాత్ర ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరవడంతో రెండు నెలల పాటు కొనసాగే అయ్యప్ప దీక్షల సందడి మొదలైంది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. వేలాది మంది భక్తులు ఇరుముడులు ధరించి స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు.
కొత్త మేళశాంతి (ప్రధాన అర్చకుడు) అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అదేవిధంగా మాళికప్పురం ఆలయంలో కొత్త ప్రధాన అర్చకుడు ఏ. దామోదరన్ నంబూద్రి పూజలు నిర్వహించారు. ఇప్పటికే వర్చువల్ క్యూ ద్వారా 66 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా మరో 14 వేల మంది దర్శనం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పవిత్రమైన 18 మెట్లపై నిమిషానికి 75 మంది చొప్పున భక్తులను అనుమతించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నీలక్కల్, ఎరుమేలి, సత్రం ప్రాంతాల్లో స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పంబాలో మాత్రం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో స్పాట్ బుకింగ్‌కు అనుమతి ఇవ్వలేదు.
భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు నీలక్కల్‌లో కృత్రిమ మేధస్సు (AI) కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. అలాగే సుమారు 6 వేల మంది భక్తులు బస చేసేందుకు తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేశారు.
డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించనుండగా, జనవరి 14న పవిత్ర మకరవిళక్కు ఉత్సవం జరగనుంది. తీర్థయాత్ర ముగింపు సందర్భంగా జనవరి 20న ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు.
