జీవితంలో ఎదురయ్యే అపజయాలే మనకు విజయాల కంటే ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయని నటి సమంత అన్నారు. తన తొలి వ్యాపార భాగస్వామ్యం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆ అనుభవం తనకు ఎంతో విలువైన పాఠాలు నేర్పిందని వెల్లడించారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె.. వ్యాపార రంగంలో తన అనుభవాలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడారు.

Samantha Opens Up About Her First Business Failure: “Failures Taught Me More Lessons Than Success”

తొలి వ్యాపార వైఫల్యంపై సమంత ఏమన్నారంటే?

తన మొదటి వ్యాపార ప్రయత్నం విజయవంతం కాలేదని సమంత గుర్తుచేసుకున్నారు. అయితే ఆ వైఫల్యాన్ని తాను ప్రతికూలంగా చూడటం లేదని చెప్పారు.

‘‘నా తొలి వ్యాపార భాగస్వామ్యం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ మొదటిసారి పెట్టుబడి పెట్టిన వ్యాపారం విఫలమవడం కూడా మంచిదే. ఎందుకంటే విజయాల కంటే అపజయాలే మనకు ఎక్కువ విషయాలు నేర్పిస్తాయి. నా జీవితంలో నేర్చుకున్న పాఠాల్లో చాలా వరకు వైఫల్యాల నుంచే వచ్చాయి. విజయాలు నాకు పెద్దగా ఏమీ నేర్పించలేదు’’ అని సమంత వివరించారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు

వ్యాపార రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా సమంత తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే చాలామంది మహిళలు భయపడుతుంటారని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడం తనకు కొత్త అనుభవమని చెప్పారు.

ఇప్పటివరకు తాను దాదాపు 8 నుంచి 10 వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమంత వెల్లడించారు. వాటిలో ఎనిమిది సంస్థలకు మహిళలే వ్యవస్థాపకులుగా ఉండటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.

‘సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళం’తో బిజీ

ప్రస్తుతం సమంత ‘సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళం’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సినిమాలు, వ్యాపార కార్యకలాపాలతోనూ ఆమె బిజీగా ఉన్నారు. వ్యాపారంలో ఎదురైన తొలి ఓటమి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *