
ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది వాటి వివరాలు. దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి /దక్షిణ దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో ఆగ్నేయం దిశగా గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతవారణశాఖ తెలిపింది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణశాఖ అధికారులు ఓ వెదర్ బులిటెన్ విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హెచ్చరించింది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడుతుందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర క్రమంగా పెరిగే అవకాశముందని అంచనా వేసింది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండ ప్రభావం పెరగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా.
మధ్యాహ్నం వేళ ఎండ వేడి మరింత పెరుగుతోంది. దీంతో పాటు ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మార్చిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండగా.. ఏప్రిల్ నాటికి ఎండలు భగ్గుమనే అవకాశముంది. దీంతో ఎండలపై తాజాగా హోంమంత్రి అనిత అధికారులతో సమావేశమయ్యారు. సమ్మర్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. విపత్తు నిర్వహణశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్లు, లైన్ డిపార్టమెంట్ అధికారులు కూడా హాజరయ్యారు.

