బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నవంబర్ 16వ తేదీ ఉదయం 5.30 గంటల సమయానికి 11.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.

విశాఖకు 820 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం

ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 940 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీలంకలోని ట్రింకోమలీకి ఈశాన్యంగా 630 కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురానికి పశ్చిమాన 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఐఎండీ వివరించింది.

నేడు తుపానుగా.. రేపు తీవ్ర తుపానుగా మారే అవకాశం

తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 17వ తేదీ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారవచ్చని పేర్కొంది. అనంతరం మరింత బలపడి వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్ 19వ తేదీ రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఐఎండీ ప్రీ సైక్లోన్ వాచ్ కింద ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుపానుగా మారే అవకాశాలు, దాని ప్రయాణ దిశ, తీవ్రతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలు, అధికారుల హెచ్చరికలను పాటించాలని సూచించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *