
చేతికొచ్చే దశలో ఉన్న పంటలు ఎండిపోకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. పంటలకు చివరి తడి అందించేందుకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. రైతుల విజ్ఞప్తిపై మంత్రి వెంటనే స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలను కాపాడేందుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని సూచించారు. దీంతో అధికారులు వైరా-ఏన్కూరు, రామచంద్రపురం మేజర్ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ నీరు రేపటికి ఆయా ప్రాంతాలకు చేరుకోనుంది.
విడుదల చేసిన సాగునీటిని రైతులు కేవలం పంటల అవసరాలకే వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. చివరి తడి అందించడం ద్వారా చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రైతుల విజ్ఞప్తికి తక్షణమే స్పందించి సీతారామ ప్రాజెక్టు జలాలను విడుదల చేయడంతో పంటలకు చివరి తడి అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
