D Spiritual: Nov 18: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని పురాతన శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) ప్రారంభించింది. భారత్-శ్రీ ప్రాజెక్టులో భాగంగా ఏఎస్ఐ శాసన విభాగం తిరుమల ఆలయ ప్రాకార గోడలపై ఉన్న శాసనాలను సేకరించింది. వీటిని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో డిజిటలైజేషన్ చేపట్టింది.

ఇప్పటికే సేకరించిన సుమారు 100 శాసనాల ప్రతిరూపాలను డిజిటలైజ్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియను డిసెంబర్ 1 నుంచి చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆలయ మొదటి ప్రాకారం ఉత్తర గోడపై చెక్కిన రెండు శాసనాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నట్లు ఏఎస్ఐ గుర్తించింది.

తెలుగు భాష, లిపిలో ఉన్న ఈ రెండు శాసనాలు 1434 నాటి ఆంగీరస నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, పంచమి తిథికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి. వీటి తేదీని క్రీ.శ. 1513 ఫిబ్రవరి 10గా ఏఎస్ఐ గుర్తించింది.

ఈ శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయల రాణులు చిన్నాజీ అమ్మ, తిరుమలమ్మ సమర్పించిన కానుకల వివరాలు ఉన్నాయి. తిరువేంగళనాథునికి (శ్రీ వేంకటేశ్వర స్వామి) రాత్రిపూట పూజలు నిర్వహించిన అనంతరం పాలు నైవేద్యంగా సమర్పించేందుకు 374 తూకాల బరువున్న రెండు బంగారు పాత్రలను కానుకగా ఇచ్చారు. అలాగే సుగంధ ద్రవ్యాలను ఉంచేందుకు 10 తూకాల బరువున్న ఒక బంగారు పళ్లెంను సమర్పించినట్లు ఈ శాసనాల్లో నమోదు చేశారు.

శ్రీకృష్ణదేవరాయలు తిరుమల క్షేత్రాన్ని ఏడుసార్లు సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ శాసనాల్లో పేర్కొన్న బంగారు కానుకలను ఆయన తన తొలి తిరుమల పర్యటన సమయంలోనే సమర్పించడం విశేషం. ఈ వివరాలను ఏఎస్ఐ అధికారులు శాసనాల డిజిటలైజేషన్ సందర్భంగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *