మెల్‌బోర్న్, నవంబర్ 15: ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అస్రిత్ దేవళ్ల తన ప్రతిభ, నాయకత్వ లక్షణాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆయన పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డెక్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రతిష్ఠాత్మక ఏఎఫ్ఆర్ బాస్ అత్యంత వినూత్న సంస్థలు – 2026 అవార్డుల్లో తయారీ, వినియోగ వస్తువుల విభాగంలో కాంస్య పురస్కారాన్ని దక్కించుకుంది.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన అస్రిత్ దేవళ్ల ప్రస్తుతం డెక్స్ ఇండస్ట్రీస్ సంస్థలో వ్యాపార అభివృద్ధి, నూతన ఆవిష్కరణల విభాగం మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంస్థ సాధించిన ఈ గుర్తింపులో ఆయన కీలక పాత్ర పోషించారు. తన వృత్తిలో రాణించడమే కాకుండా, ఇతర తెలుగు నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారు.

అక్టోబర్ 21న సిడ్నీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి డెక్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రత్యేక ఆహ్వానం మేరకు స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్ సంధ్యారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెల్‌బోర్న్‌లో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విదేశాల్లో తెలుగు యువత తమ ప్రతిభతో ఉన్నత నాయకత్వ స్థానాలకు ఎదగడంతోపాటు, ఇతరులకు అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని అన్నారు.

అస్రిత్ దేవళ్ల సాధించిన ఈ ఘనత తెలుగు సమాజానికి గర్వకారణమని పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డెక్స్ ఇండస్ట్రీస్ సంస్థ యాజమాన్యాన్ని కూడా అభినందించారు.

విదేశాల్లో తెలుగు యువత సాధిస్తున్న విజయాలు, నాయకత్వ పటిమ, సమాజ అభివృద్ధికి అందిస్తున్న సహకారం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *