విజయవాడలోని కనకదుర్గ వారధి నుంచి గంగూరు క్రాస్‌ వరకు 14 కి.మీ. ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ కారిడార్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే మార్గంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేలా ప్రతిపాదన తీసుకురాగా.. త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఈ మేరకు కొత్త ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. హైదరాబాద్‌-మచిలీపట్నం జాతీయ రహదారిలో విజయవాడ నగర పరిధిలో ఉన్నంత మేరకు.. ఆ మార్గంలో ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించే ప్రతిపాదనను సర్కార్ పరిశీలిస్తోంది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ సమీపంలోని రాజీవ్‌ పార్క్‌ వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్‌ నుంచి మెుదలుకొని మచిలీపట్నం వైపు వెళ్లే మార్గంలోని గంగూరు కూడలి వరకు మెుత్తంగా 14 కి.మీ. మేర ఈ పైవంతెన నిర్మించాలని భావిస్తున్నారు. ఆరు వరుసలతో నిర్మించే ఫ్లై ఓవర్ కారణంగా హైవేలో ప్రయాణించే వారికి ఏ ఆటంకాలూ ఉండవని, విజయవాడ నగర ట్రాఫిక్‌ కష్టాలకు చెక్ పడుతుందని అధికారులు యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎలా చేపట్టవచ్చన్న భిన్న ప్రణాళికలపై ఢిల్లీ స్థాయిలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్చిస్తున్నారు.

హైదరాబాద్‌- విజయవాడ- మచిలీపట్నం హైవే-65పై విజయవాడ పరిధిలో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లైఓవర్, కృష్ణలంక, వారధి జంక్షన్, బెంజ్‌ సర్కిల్, ఆటోనగర్‌ గేట్, కానూరు, పోరంకి, పెనమలూరు మీదుగా ఈ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఎన్‌హెచ్-65ను నాలుగు నుంచి ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రాజెక్ట్‌ చేపట్టారు. దీన్ని గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్‌ క్రాస్‌ అయ్యే పాయింట్‌ వరకే విస్తరించాలని ముందుగా భావించారు. ఆ తర్వాతా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భవానీపురం వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్‌ దాకా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పుకుంది. ఈ మేరకు డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. విజయవాడ-మచిలీపట్నం హైవేను ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్‌ కూడా చేపడుతున్నారు.