
విశాఖపట్నం: విశాఖ నగర నూతన మేయర్ ముక్కా శ్రావణి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
కుమార్తె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేయడాన్ని చూడకముందే తండ్రి మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ వార్త తెలియడంతో బంధువులు, అభిమానులు, అనుచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ముక్కా ముత్యాల నాయుడు మృతి పట్ల జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన నాయకుడు గంట్ల శ్రీనుబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముత్యాల నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మేయర్ ముక్కా శ్రావణికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
