సోషల్ మీడియా ఫ్యామిలీ, లైఫ్‌స్టైల్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రామ నందనపై యూకే ఉద్యోగాలు, వీసా పొడిగింపు, Certificate of Sponsorship (CoS) ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.

లుక్‌అవుట్ నోటీసు ఆధారంగా శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నందనను గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ కేసులో ఆమె భర్త జగర్లమూడి మధుకర్, మధుకర్ తండ్రి మోహన్‌రావుపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

రూ.15 లక్షలు చెల్లించారన్న ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. యూకే ఉద్యోగం, వీసా పొడిగింపు, తన భార్యకు CoS ఇప్పిస్తామని చెప్పడంతో ఓ వ్యక్తి విడతలవారీగా సుమారు రూ.15 లక్షలు చెల్లించినట్లు ఆరోపించారు.

అయితే హామీ ఇచ్చిన సేవలు అందలేదని, ఇచ్చిన CoS పత్రం నకిలీదని ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్లు సమాచారం. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన తర్వాత సుమారు రూ.2 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చారని ఆరోపించారు.

ఈ కేసులో డబ్బులు ఎవరికి వెళ్లాయి? ఏ ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి? CoS పత్రాలు నిజమైనవేనా? నందన, ఆమె భర్త పాత్ర ఎంత? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. డెస్టినీ కన్సల్టెన్సీతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.

నందన తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదైనంత మాత్రాన ఆరోపణలు రుజువైనట్లు కాదు. వాస్తవాలు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *