
తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి మరో అరుదైన గౌరవం దక్కింది. తనదైన నటనతో దక్షిణాది ప్రేక్షకులనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీ ప్రతిభను చాటుకునే అవకాశం అందుకున్నారు. 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు.
విభిన్న కథలు, ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి ఈ అవకాశం రావడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. నవంబర్ 23, 2026న న్యూయార్క్‌లో జరగనున్న 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డులు అందించే ప్రెజెంటర్లలో ఆయన కూడా ఒకరిగా ఉండనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా ఆయన గుర్తింపు పొందనున్నట్లు కథనంలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ వేదికపై భారతీయ నటుడికి అరుదైన అవకాశం
ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశం విజయ్ సేతుపతి కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలవనుంది. గతంలో 2016లో జరిగిన 68వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుకలో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్‌స్టన్‌తో కలిసి అవార్డును అందించారు. అయితే ఇంటర్నేషనల్ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతికి దక్కిన ఈ అవకాశం ప్రత్యేక గుర్తింపుగా మారింది.
అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో నిర్మాత, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో హాస్యనటుడు వీర్ దాస్‌ను ఇంటర్నేషనల్ ఎమ్మీ వేడుకకు హోస్ట్‌గా తీసుకురావడంలోనూ ఆమె పాత్ర ఉంది.
వరుస సినిమాలతో బిజీగా విజయ్ సేతుపతి
ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘బత్తా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.
దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘ఇంజి వెల్లం’ సినిమాలో సాయిపల్లవితో కలిసి నటిస్తున్నారు. అలాగే మైస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ట్రైన్’ చిత్రంతో పాటు ‘పాకెట్ నవల్’ అనే మరో ప్రాజెక్టులోనూ భాగమయ్యారు.
హాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన ‘మహారాజా’
విజయ్ సేతుపతి కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మహారాజా’ సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 2024లో విడుదలైన ఈ తమిళ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా చైనాలోనూ ఈ సినిమాకు ఆదరణ దక్కింది. దీంతో ‘మహారాజా’ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో రీమేక్ చేసేందుకు హాలీవుడ్‌కు చెందిన ఓ ఏజెన్సీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై ప్రెజెంటర్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకోవడం విజయ్ సేతుపతి అభిమానులకు సంతోషాన్నిస్తోంది.
