కర్నూలు, కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు, సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి లెక్కింపు చేపట్టారు.

తొలుత స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను పోలీసుల పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. అనంతరం ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను బయటకు తీశారు. బ్యాలెట్ పత్రాలను క్రమపద్ధతిలో వేరు చేసి, అభ్యర్థుల వారీగా కట్టలు కట్టే ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించేలా అధికారులు ప్రతి దశను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపోటములు తేలనుండటంతో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By Ramya