పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో పెరుగుతున్న ఊబకాయ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తొలిసారిగా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. అధిక బరువుతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో మందులు, శస్త్రచికిత్సలపై మాత్రమే ఆధారపడకుండా.. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పిల్లల వయసు, ఆరోగ్య పరిస్థితి, ఊబకాయం తీవ్రతను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స అందించాలని స్పష్టం చేసింది.

Weight Loss Surgery | పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తొలిసారిగా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. అధిక బరువును తగ్గించేందుకు మందులు, శస్త్రచికిత్సల కంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించింది.
తొమ్మిదేళ్లలోపు పిల్లలకు బరువు తగ్గించే మందులు, శస్త్రచికిత్సలు లేదా ప్రత్యేక పరికరాలను ఉపయోగించడాన్ని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేయలేదు. 10 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో సమగ్ర జీవనశైలి మార్పుల కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు కనిపించనప్పుడు, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆమోదం పొందిన మందులను పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది.
అదేవిధంగా, తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న కౌమారదశ పిల్లలకు బరువు తగ్గించే శస్త్రచికిత్సను సాధారణ పరిష్కారంగా చూడకూడదని స్పష్టం చేసింది. నిర్దిష్ట వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండి, కఠినమైన నిబంధనలు పాటించిన సందర్భాల్లోనే నిపుణులు శస్త్రచికిత్సను పరిశీలించాలని సూచించింది. పిల్లల్లో ఊబకాయం నియంత్రణకు ముందుగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం, అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం కీలకమని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
10 కోట్ల మంది పిల్లలు, యువత ఊబకాయంతో బాధపడుతున్నారు..
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం.. 2024లో ఐదు నుంచి తొమ్మిదేళ్ల వయస్సున్న సుమారు ఏడు కోట్ల మంది పిల్లలు, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సున్న దాదాపు 10 కోట్ల మంది కౌమారదశ యువత ఊబకాయంతో బాధపడుతున్నారు. ఐదు నుంచి 19 ఏళ్ల వయస్సున్నవారిలో ఊబకాయం ప్రాబల్యం 1990లో రెండు శాతంగా ఉండగా, 2024 నాటికి ఎనిమిది శాతానికి చేరింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో ఊబకాయం పెరుగుదల ఆందోళనకరంగా మారింది. కొన్ని అధిక ఆదాయ దేశాల్లో ఈ పెరుగుదల నిలకడకు చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి..
పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయాన్ని నియంత్రించేందుకు పోషకాహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఊబకాయం చికిత్సలో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆందోళన, నిరాశ, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు, శారీరక చురుకుదనం తగ్గడానికి, ఇతరులకు దూరంగా ఉండటానికి కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, అధిక బరువుతో ఉన్న పిల్లలు ఇతరుల నుంచి అవమానాలు, వేధింపులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, ఇవి వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. అందువల్ల పిల్లలకు కుటుంబ సభ్యులు, పాఠశాలలు, ఆరోగ్య నిపుణుల నుంచి తగిన సహకారం అందించడం అవసరమని సూచించింది.
అవసరమైతేనే బరువు తగ్గించే శస్త్రచికిత్స..
తీవ్రమైన ఊబకాయంతోపాటు టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న కౌమారదశ పిల్లలకు జీవనశైలి మార్పులతో ఆశించిన ఫలితాలు లభించనప్పుడు, నిపుణుల వైద్య బృందం పర్యవేక్షణలో బరువు తగ్గించే శస్త్రచికిత్సను పరిశీలించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అయితే, పిల్లల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ఊబకాయం తీవ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాలి. పెద్దల ఊబకాయం చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలతో పోలిస్తే, పిల్లల విషయంలో చికిత్సా విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పెద్దలకు కొన్ని బరువు తగ్గించే, మధుమేహ చికిత్స మందులను ఉపయోగించే అవకాశాలున్నప్పటికీ, పిల్లలు, కౌమారదశలో ఉన్నవారికి సమగ్ర ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, శారీరక శ్రమ, కుటుంబ సహకారంతో కూడిన జీవనశైలి మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం అలవర్చడం ద్వారా ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించేందుకు తల్లిదండ్రులు, సంరక్షకులు కృషి చేయాలని సూచించింది.
