శ్రీకాకుళం రిమ్స్‌లో పెరిగిన పడకల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, వైద్య సిబ్బందిని ఎప్పటిలోగా నియమిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిమ్స్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని రెండేళ్లు పూర్తవుతున్నా ఎందుకు అమలు చేయలేదని గోవిందరావు ప్రశ్నించారు. ఒకప్పుడు 350 పడకలకు ఉన్న సిబ్బందితోనే ప్రస్తుతం 900 పడకల ఆస్పత్రిని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పెరిగిన పడకలకు అనుగుణంగా వైద్యులు, నర్సింగ్‌, ఇతర సిబ్బంది పోస్టులను పెంచాలని డిమాండ్‌ చేశారు.

రిమ్స్‌లో పేద, మధ్యతరగతి రోగులు ఇబ్బందులు పడుతున్నారని, పలు కీలక విభాగాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో లేరని గోవిందరావు పేర్కొన్నారు. ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ తదితర విభాగాల్లో సిబ్బంది కొరత ఉందన్నారు.

గుండె, కిడ్నీ, నరాలు, మెదడు, వెన్నుముక, క్యాన్సర్‌, మూత్ర సంబంధ వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు పరిమితంగా అందుతున్నాయని ఆరోపించారు. స్కానింగ్‌ వంటి పరీక్షలకు రోగులు ఎక్కువకాలం వేచి చూడాల్సి వస్తోందని అన్నారు.

అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గోవిందరావు ఆరోపించారు. క్యాథ్‌ ల్యాబ్‌, యూరాలజీ, న్యూరో సర్జరీకి అవసరమైన పరికరాలను సమకూర్చాలని, ఐసీయూ సహా కీలక విభాగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు.

41 మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చి రెండేళ్లు గడిచినా పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఎఫ్‌ఎన్‌ఓలు, ఎంఎన్‌ఓలు, పారిశుధ్య సిబ్బంది పోస్టులను పెంచి తక్షణమే భర్తీ చేయాలని కోరారు.

రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసి, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల మద్దతుతో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో పి. ప్రసాద్‌, ఎం. సత్యం, ఎం. గోపి, కొత్తకోట అప్పారావు, పి. చంద్రరావు, నందోడు, ప్రవీణ్‌, చిన్నారావు, చందు తదితరులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *