కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నవంబర్‌ 10న పాఠకుల ముందుకు రానుంది. పుస్తక విడుదల నేపథ్యంలో ఆమె బ్రిటిష్‌ పత్రిక ‘ది గార్డియన్‌’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోయిందన్న వాదనను సోనియా గాంధీ తోసిపుచ్చారు. పార్టీ భవిష్యత్తుపై తాను ఆశాభావంతో ఉన్నానని వెల్లడించారు. అయితే కాంగ్రెస్‌పై గాంధీ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోందన్న విమర్శలు, పార్టీపై కుటుంబం పెత్తనం వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్‌ పార్టీలో గాంధీ కుటుంబం ఆధిపత్యం, వారసత్వ రాజకీయాలపై వస్తున్న విమర్శలకు సోనియా గాంధీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. బ్రిటిష్‌ పత్రిక ‘ది గార్డియన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆమె ఆచితూచి స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ గాంధీ కుటుంబ నాయకత్వాన్ని దాటి ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోందన్న ప్రశ్నకు.. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీకే అడగాలని సూచించారు. ఒకే కుటుంబం చేతిలో పార్టీ కొనసాగుతోందన్న విమర్శలను నేరుగా ఖండించకుండా సమాధానాన్ని దాటవేశారు.

వారసత్వ రాజకీయాలపై ఏమన్నారంటే?

వారసత్వ రాజకీయాలపై వచ్చిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘మేమందరం ఎన్నికల్లో పోటీ చేస్తాం. గెలుస్తాం, ఓడిపోతాం. ఈ విషయంలో ఎవరూ మినహాయింపు కాదు’’ అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, కుటుంబ రాజకీయాలపై వచ్చిన విమర్శలకు ఆమె నేరుగా వివరణ ఇవ్వలేదని ‘ది గార్డియన్‌’ తన ఇంటర్వ్యూలో పేర్కొంది.

త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నేపథ్యంలో సోనియా గాంధీ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోవైపు, బీజేపీకి కాంగ్రెస్‌ ఇప్పటికీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలవగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే, వరుస ఎన్నికల పరాజయాల నేపథ్యంలో కాంగ్రెస్‌ సామర్థ్యంపై ప్రజల్లో, పార్టీ వర్గాల్లో నమ్మకం తగ్గుతోందని ఇంటర్వ్యూయర్‌ ప్రస్తావించగా, పార్టీ భవిష్యత్తుపై తాను ఆశాభావంతో ఉన్నానని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ఎదుర్కొన్న వరుస ఎన్నికల పరాజయాలను కూడా ‘ది గార్డియన్‌’ తన కథనంలో ప్రస్తావించింది. సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ చేతిలో ఓటమి చవిచూసిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, మరోవైపు బీజేపీ హిందుత్వ రాజకీయాలతో దేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిందని విశ్లేషించింది.

గాంధీ కుటుంబం చుట్టూనే కాంగ్రెస్‌ నాయకత్వం కొనసాగుతుండటంతో కుటుంబ రాజకీయాలు, వీఐపీ సంస్కృతి, ఉన్నత వర్గాల ఆధిపత్యం వంటి విమర్శల నుంచి పార్టీ బయటపడటం కష్టంగా మారిందని బ్రిటిష్‌ పత్రిక అభిప్రాయపడింది.

ఇదే ఇంటర్వ్యూలో 2014 వరకు కొనసాగిన పదేళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న వివాదాలు, అవినీతి ఆరోపణలపై కూడా సోనియా గాంధీని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆమె.. ఆరోపణలు ఎదురైన సందర్భాల్లో దాదాపు ప్రతిసారీ సంబంధిత మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేశారని సమర్థించుకున్నారు. అయితే, కుటుంబ రాజకీయాలు, అగ్రనాయకత్వం చుట్టూ ఉన్న ఆధిపత్యం వంటి అంశాలపై వస్తున్న విమర్శలు కాంగ్రెస్‌కు సవాలుగా మారాయని ‘ది గార్డియన్‌’ తన విశ్లేషణలో పేర్కొంది

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నిర్ణయం తప్పిదమేనని సోనియా గాంధీ అంగీకరించారు. చివరకు ఇందిరా గాంధీ కూడా తన నిర్ణయంపై అదే అభిప్రాయానికి వచ్చి ఉంటారని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘ఈ విషయం చెప్పినప్పుడు చాలామంది నవ్వుకోవచ్చని నాకు తెలుసు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిర ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు కాదు. ఆ నిర్ణయం ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపిందని నేను నమ్ముతున్నాను’’ అని సోనియా వ్యాఖ్యానించారు.

ఇందిరపై సంజయ్‌ గాంధీ ప్రభావం

ఎమర్జెన్సీ విధించే విషయంలో గాంధీ కుటుంబంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సోనియా తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ది గార్డియన్‌’ కథనం ప్రకారం.. అప్పట్లో ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు, సోనియా భర్త రాజీవ్‌ గాంధీ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వెంటనే కఠిన నిర్ణయం తీసుకోకుండా తదుపరి ఎన్నికల వరకు వేచి చూడాలని తన తల్లికి సూచించినట్లు పేర్కొన్నారు.

అయితే, ఇందిర చిన్న కుమారుడు సంజయ్‌ గాంధీ మాత్రం ప్రతిపక్షాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఒత్తిడి తెచ్చినట్లు కథనం వెల్లడించింది. కుటుంబ సభ్యులతో జరిగిన విందు సమయంలో ఇందిరతో సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు మిమ్మల్ని రాజకీయంగా దెబ్బతీస్తాయని, వారిని తక్షణమే అడ్డుకోవాలని హెచ్చరించినట్లు పేర్కొంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీపై సంజయ్‌ గాంధీ చూపిన ప్రభావం అప్పట్లో తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది.