
దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌కు చేరుకున్నారు. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల అనంతరం భారత గడ్డపై ఇరు దేశాల నేతల మధ్య జరుగుతున్న తొలి కీలక సమావేశం ఇదే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.
భారత్-చైనా మధ్య నెలకొన్న విభేదాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. మరోవైపు, సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా పునఃప్రారంభం కానుండటం కీలక పరిణామంగా మారింది.
అంతర్జాతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొన్న వేళ.. భారత రాజధాని న్యూఢిల్లీలో అత్యంత కీలకమైన 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం బీజింగ్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు.
2020లో చోటుచేసుకున్న గల్వాన్ లోయ సరిహద్దు ఘర్షణల అనంతరం చైనా అధ్యక్షుడు భారత గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న షీ జిన్‌పింగ్.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.
శనివారం సాయంత్రం 5.45 గంటలకు మోదీ, షీ జిన్‌పింగ్ మధ్య ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు, సరిహద్దు సమస్యలు, పరస్పర సహకారంతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ సమాజానికి సవాలుగా మారాయి. నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తోడు ఇరాన్‌కు సంబంధించిన యుద్ధ పరిణామాలు కూడా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఈ పరిణామాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతోంది.
ఇలాంటి కీలక సమయంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ సదస్సు అంతర్జాతీయ దౌత్యంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా భారత్–చైనా సంబంధాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కొంతకాలంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వరుసగా మూడో ఏడాది ముఖాముఖిగా భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కజాన్, తియాంజిన్ నగరాల్లో జరిగిన సమావేశాల అనంతరం మరోసారి ఇరువురు నేతలు సమావేశం కావడంతో సరిహద్దు వివాదాల పరిష్కారం, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై కొత్త ఆశలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి: బ్రిక్స్ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. రెండు వారాల్లోనే మరోసారి ముఖాముఖి
