
విజయనగరంలో వైసీపీకి వరుస షాక్‌లు.. ఐదుగురు జెడ్పీటీసీల రాజీనామా
విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకేరోజు జిల్లాకు చెందిన ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో ముగ్గురు త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
వైసీపీకి రాజీనామా చేసిన వారిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు వలిరెడ్డి శిరీష ఉన్నారు. ఆమె భర్త, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వి. శ్రీనివాసనాయుడు కూడా పార్టీకి రాజీనామా చేశారు. మజ్జి శ్రీనుతో ఉన్న అనుబంధం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో టీడీపీలో చేరనున్నట్లు వారు వెల్లడించారు.
విజయనగరం మండలం జొన్నవలసకు చెందిన జెడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు కూడా తన పదవికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. అలాగే కొత్తవలస జెడ్పీటీసీ ఎన్. శ్రీదేవి కూడా పార్టీకి రాజీనామా చేశారు.
మరోవైపు గజపతినగరం మండల జెడ్పీటీసీ గార తవుడు, గంట్యాడ మండల జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి సైతం తమ పదవులతో పాటు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇటీవల మజ్జి శ్రీను తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నుంచి మరింత మంది నేతలు, ప్రజాప్రతినిధులు బయటకు వస్తున్నారనే చర్చ జరుగుతోంది.
