
దక్షిణ భారతదేశంలో ద్రౌపదీ దేవి సమేత పాండవ రాజుల ఆలయానికి ప్రత్యేకంగా రథం ఉన్న ఏకైక ఆలయంగా పుత్తూరు ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది.
విజయనగర సామ్రాజ్యం పతనం అనంతరం ఔరంగజేబు సైన్యం దక్షిణ భారతదేశంలో దాడులు చేసిన సమయంలో తమిళనాడులోని చెంగల్పట్టు ప్రాంతం నుంచి పలువురు పుత్తూరుకు వలస వచ్చినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో ఏడుగురు అన్నదమ్ములు ఓ బావి తవ్వుతుండగా అమ్మవారి విగ్రహం బయటపడినట్లు కథనం.
ఈ సంఘటన అనంతరం అమ్మవారికి ఆలయం నిర్మించినట్లు చెబుతారు. కాలక్రమేణా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.
భారతీయ సంస్కృతిలో పాండవులు, ద్రౌపదికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మహాభారతంలో వీరి పాత్ర ఎంతో కీలకమైనది. సాధారణంగా మన దేశంలో దేవతలకు ఆలయాలు ఉండటం సహజం. అయితే మహాభారత పాత్రలైన ద్రౌపదీ దేవి, పాండవులకు ఆలయాలు ఉండటం మాత్రం అరుదుగా కనిపిస్తుంది.
అలాంటి ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఓ ఆలయం దక్షిణ భారతదేశంలో ఉంది. అంతేకాదు, పాండవులకు ప్రత్యేకంగా రథం ఉన్న ఆలయం దక్షిణ భారతదేశంలో ఇదొక్కటేనని చెబుతారు. చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుత్తూరు పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ‘పుత్తూరు కట్టు’. ఎముకలు విరిగినప్పుడు లేదా ప్రమాదాల్లో గాయపడినప్పుడు పుత్తూరు కట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ పట్టణానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.
పుత్తూరులోని ప్రముఖ ఆలయం దక్షిణ భారతదేశంలోనే పాండవులకు ప్రత్యేకంగా రథం ఉన్న ఏకైక ఆలయంగా పేరుగాంచింది. శ్రావణ మాసంలో ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ‘మహాభారత బ్రహ్మోత్సవాలు’ పేరుతో జరిగే ఈ వేడుకలు దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పుత్తూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

