
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న చేరికల కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో చేరికలు
కొత్తపేట పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు సకాలభక్తుల గిరి, సుంకర ఆనందరావు, జామి శేఖర్, సకాలభక్తుల దుర్గారావుతో పాటు పలువురు కుటుంబాలు శుక్రవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఇదిలా ఉండగా శ్రీకాకుళం జడ్పీ చైర్‌పర్సన్‌గా కూటమి తరఫున జనసేన నుంచి ఎన్నికైన కొరినాన భవానీ, ఆమె భర్త, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో 300 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి
ఆమదాలవలస పట్టణ పరిధిలో సుమారు 300 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. శుక్రవారం పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
జిల్లా సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జేజే మోహన్‌రావు, పట్టణ రోటరీ క్లబ్ అధ్యక్షుడు జేకే వెంకన్నబాబు, జిల్లా క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు జె.భాస్కరరావు ఆధ్వర్యంలో పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి.
జీకే బ్రదర్స్‌తో పాటు జిల్లా ఎక్స్ సర్వీస్‌మెన్ సంఘం అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, టైలర్ల సంఘం నాయకులు, సభ్యులు, క్లాత్ మర్చంట్ యూనిట్ సభ్యులు, ముస్లిం సంఘాల నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
లైదాంలో వైసీపీకి షాక్ 30 కుటుంబాల చేరిక
పంచాయతీ ఎన్నికల వేళ లైదాం పంచాయతీ పరిధిలోని కొల్లిపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే కూన రవికుమార్ వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కర్, మాజీ సర్పంచ్ గొర్లె అనంతరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒకేరోజు పెద్ద సంఖ్యలో వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
