
Hyderabad Woman Arrested In Vijayawada AQIS Link Case:
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. సయీదా బేగంకు ఇప్పటికే విజయవాడలో అరెస్టైన ముగ్గురు యువకులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఏపీలో సంచలనంగా మారిన ఈ ఉగ్ర లింకుల కేసు మరో కీలక మలుపు తీసుకుంది. తాజాగా అదుపులోకి తీసుకున్న సయీదా బేగంను రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. యువతను ఉగ్రవాద దిశగా మళ్లించేలా ఆమె ప్రభావితం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో అరెస్టైన ముగ్గురు యువకులను కూడా ఆమెనే ప్రభావితం చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆమెను అధికారికంగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశముందని తెలుస్తోంది.
విజయవాడలో వెలుగులోకి వచ్చిన ఈ ఉగ్ర లింకుల వ్యవహారం కలకలం రేపుతోంది. నగరానికి చెందిన ముగ్గురు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ అనే ఈ ముగ్గురు పాకిస్థాన్ వెళ్లి అక్కడ శిక్షణ పొందేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ ముగ్గురు కలిసి ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ అనే పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేసి, Al-Qaeda, ISIS వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వీరిలో మహమ్మద్ రహమతుల్లా విజయవాడలో ఓలా, ర్యాపిడో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను ఉగ్రవాద భావజాలానికి సంబంధించిన వీడియోలను వీక్షిస్తూ, క్రమంగా ఆ దిశగా ఆకర్షితుడయ్యాడు. సోషల్ మీడియా ద్వారా కూడా అటువంటి వీడియోలను పంచుకుంటూ ఉండేవాడు. అనంతరం మహమ్మద్ దానిష్, మీర్జా సొహైల్ బేగ్‌లతో కలిసి ఈ కార్యకలాపాలను కొనసాగించాడు.
సోషల్ మీడియా వేదికగా ఐసిస్, అల్‌ఖైదా పేర్లతో గ్రూపులు సృష్టించి, యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారి విచారణలోనే హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగంతో ఉన్న లింకులు బయటపడటంతో, ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.

