తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. హైదరాబాద్‌లో మరో భారీ బస్ డిపో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీకి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఎంపీల ప్రశ్నపై నితిన్ గడ్కరీ వివరాలు వెల్లడించారు. డిపో స్థలం, బస్సు సర్వీసులు, స్థలం కేటాయింపునకు సంబంధించి ప్రకటన చేశారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పెరుగుతోంది.. ఎక్కడికక్కడే ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేసినా సరే ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. మెట్రో రైలుతో పాటుగా ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉన్నా సరే ట్రాఫిక్ కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ నగరంలో వాహనాలకు తోడు తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు హైదరాబాద్‌కు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఆర్టీసీ బస్సులు నగరానికి రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల కోసం

ఎంజీబీఎస్, జేబీఎస్‌ బస్ స్టేషన్‌లు ఉన్నాయి.. అయినా సరే ఒత్తిడి ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో మరో బస్టాండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.. టీజీఎస్‌ఆర్టీసీ 100 ఎకరాల్లో అత్యాధునిక బస్‌ టెర్మినల్‌ను ప్లాన్ చేసింది. తాజాగా ఈ డిపోకు సంబంధించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జగద్గిరిగుట్ట దగ్గర బస్‌ డిపో నిర్మాణం కోసం కుత్బుల్లాపుర్‌ మండలం గాజుల రామారం దగ్గర 100 ఎకరాలు కేటాయించినట్లు నితిన్‌ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్ట మీదుగా 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు కలిపి రోజూ 404 ట్రిప్పుల వరకు తిరుగుతాయన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ బస్‌ డిపో, టెర్మినల్‌ నిర్మాణం కోసం 99 ఏళ్లకు లీజుకు తీసుకోవడానికి హెచ్‌ఎంటీకి చెందిన స్థలాన్ని గుర్తించిందన్నారు.