
ఆషాఢమాసం వచ్చిందంటే చాలు… ప్రతి ఒక్కరికీ గోరింటాకు గుర్తుకువస్తుంది. ఇంటింటా గోరింట సందడి నెలకొంటుంది. మహిళల జీవితాలతో ముడిపడి ఉన్న గోరింటాకుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అన్నదమ్ముల, చెల్లెళ్ల బంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని ఇది తెలియజేస్తుందని ప్రజల నమ్మకం. అతివల చేతుల అందాన్ని మరింత పెంచడంతో పాటు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో గోరింటాకు ముందుంటుంది.
అందుకే మహిళలందరూ ఆషాఢ మాసంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. కులమతాలకతీతంగా అన్ని వేడుకల్లో మగువల ముంజేతులను ముద్దాడే గోరింటాకును ప్రకృతి ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో గోరింట చెట్లు కొత్త చిగుళ్లు తొడుక్కుని కళకళలాడుతుంటాయి. ఇటీవల ఆషాఢమాసం ప్రారంభమైన నేపథ్యంలో, ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతీ ఇంటా గోరింట సందడి నెలకొంది. నలుగురు ఒక్కచోట చేరినా, శుభకార్యాలైనా, ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకొని తీరాలని పెద్దలు చెబుతుంటారు.
జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షంలో తడవాల్సి రావడం, పొలం పనులు చేసుకోవడం, ఏర్లు దాటాల్సి రావడంతో కాళ్లు, చేతులు నీటిలో నానుతుంటాయి. ఈ సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ సమస్యలను అడ్డుకుంటుంది. అలాగే, ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ మార్పు వల్ల శరీరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అన్ని రకాలుగా గోరింటాకు ఎంతో మేలు చేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తమే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో భాగమే. కేవలం ఆషాఢంలోనే కాకుండా అట్లతద్ది నాడూ, ఇతర శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఏడాదికి కొన్నిసారైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నదే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

