
అధునాతన కృత్రిమ మేధ (AI) పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.46 కోట్లు) ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. సంస్థ 75వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ నిధుల కేటాయింపును ప్రకటించినట్లు సంస్థ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి వెల్లడించారు.
మూడు కీలక రంగాల్లో నిధుల వినియోగం
ఈ ఆర్థిక సహకారాన్ని ప్రధానంగా మూడు విభాగాల్లో ఉపయోగించనున్నారు. అధునాతన ఏఐ పరిశోధనలను విస్తరించడం, విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడం, కృత్రిమ మేధ రంగంలో నైపుణ్యాలను పెంపొందించడం వంటి కార్యక్రమాలకు ఈ నిధులు తోడ్పడనున్నాయి. దీనివల్ల పరిశోధకులు, విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఐఐటీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సుందర్ పిచాయ్
ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. భారతీయ భాషలు, వ్యవసాయం, విద్య వంటి కీలక రంగాల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ విశేష కృషి చేస్తోందని ప్రశంసించారు. గూగుల్‌తో ఏర్పడిన ఈ భాగస్వామ్యం ద్వారా ఆ పరిశోధనల ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు సహకరిస్తామని తెలిపారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ తన భవిష్యత్తుకు పునాది వేసిందని, ఇప్పుడు ఈ సంస్థతో కలిసి పనిచేయడం ద్వారా భవిష్యత్ తరాల విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ ఏఐ ప్రయోజనాలు చేరాలి
భారత్ ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధిలో ముందంజలో ఉందని సుందర్ పిచాయ్ అన్నారు. కృత్రిమ మేధ ద్వారా లభించే ప్రయోజనాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఇలాంటి భాగస్వామ్యాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
