
చిత్తూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ లక్ష్య సాధన కోసం పనిచేస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఉపాధి, సంక్షేమ రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంత్రి అన్నారు. ‘వికసిత్ భారత్–స్వర్ణాంధ్రప్రదేశ్’ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

