మంచి కథ, అద్భుతమైన కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను థియేటర్లలో ఆదరించకుండా, ఓటీటీలో విడుదలయ్యాక ప్రశంసలు కురిపిస్తున్న ప్రేక్షకుల వైఖరిపై యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని అసహనం వ్యక్తం చేశారు. ఆయన నిర్మాణంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సమ్మర్ హాలిడేస్’ థ్యాంక్స్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. చిన్న సినిమాలను థియేటర్లలో ఆదరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సోషల్ మీడియా పోస్టులతో ఉపయోగం లేదు!

‘35’, ‘90s’ వంటి మంచి సినిమాలను థియేటర్లలో చూడకుండా, ఓటీటీలో విడుదలయ్యాక చూసి ప్రశంసించడం వల్ల నిర్మాతలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ధీరజ్ అన్నారు. సినిమా బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపడం కంటే.. కుటుంబంతో కలిసి థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని సూచించారు.

సినిమాపై స్నేహితులు చెప్పిన మాటలు, రివ్యూలు చూసి స్పందించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులు స్వయంగా థియేటర్లకు రావాలని కోరారు. పక్క రాష్ట్రాల సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు.. మన దగ్గర రూపొందుతున్న మంచి చిత్రాలను కూడా ప్రోత్సహించాలని అన్నారు. ఇలాగే చిన్న సినిమాలను పట్టించుకోకపోతే తమలాంటి నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తారని, మంచి కథలతో వచ్చే ప్రతిభావంతులైన దర్శకులకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ.500 ఖర్చుతో కుటుంబమంతా కలిసి పండుగ సమయంలో మంచి సినిమాను చూసే అవకాశాన్ని వదులుకోవద్దని కోరారు.

జయసుధ నటనపై భావోద్వేగ వ్యాఖ్యలు

ఈ సినిమాకు సహకరించిన మీడియా ప్రతినిధులకు ధీరజ్ కృతజ్ఞతలు తెలిపారు. నటీనటుల గురించి మాట్లాడుతూ.. అమ్మమ్మ పాత్రకు జయసుధ తప్ప మరెవరినీ ఊహించుకోలేకపోయానని చెప్పారు. తెరపై ఆమెను చూస్తుంటే తన సొంత అమ్మమ్మ గుర్తొచ్చిందని, ఆమె నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని భావోద్వేగానికి గురయ్యారు.

అలాగే తల్లి పాత్రల్లో నటించిన వాసుకి, హర్షిని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసించారు. రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ వంటి సీనియర్ నటులు డేట్స్ విషయంలో సహకరించారని తెలిపారు. చైల్డ్ ఆర్టిస్టులు రోహన్, అరుణ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని, పిల్లల్లోని నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

టెక్నికల్ టీమ్‌పై ప్రశంసలు

సినిమా విజయవంతంగా రూపుదిద్దుకోవడంలో సాంకేతిక బృందం కృషి ఎంతో ఉందని ధీరజ్ చెప్పారు. ముఖ్యంగా ఎడిటర్ సంతోష్‌ను ప్రశంసిస్తూ.. దర్శకుడి తర్వాత మరో దర్శకుడిలా పనిచేశారని కొనియాడారు. ఎడిటింగ్‌తో పాటు డబ్బింగ్, మిక్సింగ్, డీఐ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల బాధ్యతలను కూడా తీసుకుని రాత్రింబవళ్లు శ్రమించారని తెలిపారు. తన ప్రతి సినిమాలో సంతోష్ భాగం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

‘చెన్నై లవ్ స్టోరీ’ ఫేమ్ దర్శకుడు రవి కూడా సోదరుడిలా అండగా నిలిచారని, చివరి నిమిషంలో సినిమా మెరుగుదలకు విలువైన సూచనలు అందించారని వెల్లడించారు. సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్ అందించిన విజువల్స్, సంగీత దర్శకుడు సింజిత్ అందించిన సంగీతం సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చాయని ప్రశంసించారు. భవిష్యత్తులో సింజిత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదుగుతాడనే నమ్మకం ఉందని ధీరజ్ మొగిలినేని పేర్కొన్నారు.