
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ గడ్డపై లేదా తటస్థ వేదికల్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించాడు.
ఈ క్రమంలో తన సీనియర్, దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును పంత్ అధిగమించాడు. విదేశీ, తటస్థ టెస్టుల్లో ధోనీ 2,496 పరుగులు చేయగా.. పంత్ 2,500 పరుగుల మార్కును దాటాడు. ప్రస్తుతం పంత్ 2,501 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ రికార్డు జాబితాలో ఫరూక్ ఇంజనీర్ 1,209 పరుగులతో మూడో స్థానంలో ఉండగా.. సయ్యద్ కిర్మాణీ 1,109 పరుగులతో నాలుగో స్థానంలో, కిరణ్ మోరే 901 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
విదేశీ, తటస్థ వేదికల్లో పంత్ బ్యాటింగ్ సగటు కూడా ఆకట్టుకునేలా ఉంది. అతడు 2,501 పరుగులను 41.68 సగటుతో సాధించాడు. ధోనీ 2,496 పరుగులను 32.84 సగటుతో నమోదు చేశాడు. దీంతో మొత్తం పరుగులతో పాటు బ్యాటింగ్ యావరేజ్‌లోనూ పంత్ ముందంజలో ఉన్నాడు.
గాయంతోనూ భారీ సిక్స్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్.. రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. శ్రీలంక పేసర్లు షార్ట్ పిచ్ బంతులతో అతడిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించినా.. పంత్ తన సహజ శైలిలో ఎదురుదాడి చేశాడు.
ఈ క్రమంలో అతడు కొట్టిన ఓ సిక్స్ ఏకంగా 95 మీటర్ల దూరం వెళ్లింది. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ పంత్ భారీ సిక్స్ బాదడం విశేషంగా నిలిచింది.
రెండో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు ఇప్పటికే 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో రోజు తొలి సెషన్‌లో టీమిండియా 119 పరుగులు సాధించింది.

