
భయం వెంటాడుతున్నప్పటికీ స్థిరమైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? విజయం కోసం జరిగే నిరంతర పరుగు పందెంలో చిక్కుకోకుండా మన ఆశయాలను ఎలా కొనసాగించాలి? తల్లిదండ్రులు మన ఆలోచనలను అర్థం చేసుకోలేనప్పుడు, వాటిని వారికి అర్థమయ్యేలా ఎలా వివరించాలి? డబ్బు, విలాసవంతమైన జీవితం, విజయవంతమైన కెరీర్‌ను కోరుకుంటూనే ఆధ్యాత్మికతతో జీవించడం సాధ్యమేనా?
నేటి యువతను వేధిస్తున్న ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆలోచనాత్మకమైన సమాధానాలను అందించారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో, కెరీర్, విజయ లక్ష్యాలు, కుటుంబ సంబంధాలు, భౌతిక ఆకాంక్షలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలపై యువతతో ఆయన ముచ్చటించారు. జీవితంలో విజయాన్ని అందుకోవడంతో పాటు అంతరంగ ప్రశాంతతను, సమతుల్యతను ఎలా సాధించాలో కూడా ఆయన వివరించారు.
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో శనివారం 2,000 మందికి పైగా జెన్-జి యువత గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌తో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ జీవితాల్లో ఎదురవుతున్న సవాళ్లు, సందేహాలు, సమస్యలను వారు ఆధ్యాత్మిక గురువుతో పంచుకున్నారు.
యువతరం ఆప్యాయంగా ‘కూల్ గురు’ అని పిలుచుకునే గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్.. వారి ప్రశ్నలకు సూటిగా, చమత్కారంగా సమాధానాలు ఇస్తూనే, లోతైన ఆలోచనలకు దారితీసే సందేశాలను అందించారు. ఆయన మాటలు యువతలో నవ్వులు పూయించడమే కాకుండా, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడాలనే స్ఫూర్తిని కూడా నింపాయి.
సంప్రదాయ ఆధ్యాత్మిక సమావేశాలకు పూర్తి భిన్నంగా ఈ కార్యక్రమం పాటలు, సంగీతం, కేరింతలు, నవ్వులతో ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. డబ్బు సంపాదన, మానవ సంబంధాలు, వ్యక్తిగత ఆశయాలు, జీవితంలో ఎదుగుదల వంటి అనేక అంశాలపై యువత గురుదేవ్‌ను ప్రశ్నించారు. తమ మనసులోని సందేహాలను ఆయనతో స్వేచ్ఛగా పంచుకుని, సూటైన సమాధానాలతో వాటిని నివృత్తి చేసుకున్నారు.
భయం లేకుండా స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని గురుదేవ్ జెన్-జీకి సూచించారు. అయితే, నిర్ణయంలో కట్టుబాటు ఉండాలి కానీ కఠినత్వానికి మాత్రం తావివ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. “ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అదే సమయంలో అవసరమైతే మార్పును స్వీకరించే సౌలభ్యాన్ని కూడా కలిగి ఉండాలి” అని చెప్పారు.
మన తర్కం మన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అయితే, మన జ్ఞానానికి ఎప్పుడూ పరిమితులు ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకున్న కొద్దీ మన అవగాహన విస్తరిస్తుంది, దానికి అనుగుణంగా మన దృక్కోణం కూడా మారుతుంది. అందుకే, మనకు తెలిసిన విషయాలపై దృఢమైన నమ్మకంతో నిలబడుతూనే, కొత్త విషయాలను తెలుసుకునేందుకు మనసును ఎప్పుడూ తెరిచి ఉంచడం నిజమైన సమతుల్యత అని గురుదేవ్ వివరించారు.

