
కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి సూచించారు. ఏఐ వ్యవస్థల్లో తలెత్తే చిన్న పొరపాటు కూడా బ్యాంకింగ్ రంగంలో పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని వివిధ విభాగాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయని, ఒక చోట జరిగే తప్పిదం ఇతర కార్యకలాపాలపైనా ప్రభావం చూపవచ్చని వివరించారు.
ఈ నేపథ్యంలో ఏఐ వినియోగానికి సంబంధించి స్పష్టమైన నియంత్రణలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ వ్యవస్థలకు ఇచ్చే అనుమతులు, లావాదేవీల పరిమితులు, ఆడిట్ విధానాలు, మానవ పర్యవేక్షణ వంటి అంశాలను ముందుగానే నిర్దేశించుకోవాలని సూచించారు. ముంబైలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ వ్యవస్థల కోసం పటిష్ఠమైన పాలనా విధానాలను రూపొందించడం బ్యాంకులకు అత్యవసరమని తెలిపారు.
ఏఐతో ప్రయోజనాలున్నా.. ప్రమాదాలూ ఉన్నాయి
ఏఐ సాంకేతికత వల్ల పనితీరు, ఉత్పాదకత మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శెట్టి అన్నారు. అయితే, అదే సమయంలో కొత్త తరహా నిర్వహణపరమైన సవాళ్లు కూడా ఎదురవుతాయని పేర్కొన్నారు. ఏఐ వ్యవస్థలు ఏ సమాచారాన్ని ఉపయోగించాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? ఏ సందర్భాల్లో మానవ జోక్యం తప్పనిసరి? అనే విషయాలపై బ్యాంకులు స్పష్టమైన విధానాలు కలిగి ఉండాలని సూచించారు.
ఏఐ వల్ల ఎవరికీ సేవలు దూరం కాకూడదు
సాంకేతికత వినియోగం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని రుణగ్రహీతలు, చిన్న వ్యాపారులు, సంప్రదాయ క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులకు బ్యాంకింగ్ సేవలు దూరం కాకూడదని శెట్టి స్పష్టం చేశారు. ఏఐ ఆధారంగా తీసుకునే నిర్ణయాలు సమాజంలోని అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు.
వ్యక్తిగత స్థాయి నుంచి పెద్ద సంస్థల వరకు ఏఐ వినియోగం విస్తరిస్తున్నందున, సంస్థాగత స్థాయిలో పటిష్ఠమైన ఏఐ గవర్నెన్స్ అవసరమని తెలిపారు. బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి ప్రత్యేక విధానాన్ని అమలు చేసిన తొలి బ్యాంకుగా ఎస్బీఐ నిలిచిందని శెట్టి వెల్లడించారు.
