
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ త్వరలో పౌరాణిక పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. మహాభారతంలోని వీరుడు కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘మహావీర్ కర్ణ’ సినిమాలో ఆయన టైటిల్ రోల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కర్ణుడిగా రాఘవ లారెన్స్
రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రంలో రాఘవ లారెన్స్ కర్ణుడి పాత్రను పోషిస్తున్నారు. ఆయన కెరీర్లో ఇదొక విభిన్నమైన ప్రయత్నంగా నిలవనుంది. కర్ణుడి ధైర్యం, త్యాగం, విధేయత వంటి అంశాలను తెరపై చూపించేలా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై రాఘవ లారెన్స్ సంతోషం వ్యక్తం చేశారు. కర్ణుడి వంటి గొప్ప పాత్రను పోషించే అవకాశం దక్కడం తన అదృష్టమని పేర్కొంటూ.. తనను ఈ పాత్రకు ఎంపిక చేసిన దర్శకుడు రమేశ్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు.
పాన్ ఇండియా స్థాయిలో..
‘మహావీర్ కర్ణ’ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. భారీ సెట్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో కర్ణుడి ప్రపంచాన్ని గ్రాండ్‌గా చూపించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తాజా సమాచారం. మిగతా నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను మేకర్స్ దశలవారీగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
