టాలీవుడ్‌లో యంగ్ హీరోల ఆలోచనా విధానం క్రమంగా మారుతోంది. ఇప్పటివరకు కెమెరా ముందు నటనకే పరిమితమైన పలువురు హీరోలు.. ఇప్పుడు తమలోని ఇతర ప్రతిభను కూడా బయటపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రచన, నిర్మాణం, దర్శకత్వం వంటి విభాగాల్లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం, కార్తికేయ గుమ్మకొండ పేర్లు వినిపిస్తున్నాయి.

రామ్ పోతినేని.. డైరెక్టర్‌గా కొత్త అవతారం

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమాలో లిరిసిస్ట్‌గా మారి ఓ పాటను రాసిన రామ్.. సింగర్‌గానూ తన గొంతు వినిపించాడు.

ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్‌లో 23వ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు రామ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తనను తాను నిరూపించుకునేందుకు రామ్ ప్రయత్నిస్తున్నాడు.

కిరణ్ అబ్బవరం కూడా మెగా ఫోన్ వైపు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు దర్శకత్వం వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తన కెరీర్‌లో 13వ సినిమాకు కిరణ్ స్వయంగా దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌ను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు టాక్. సినిమా టైటిల్‌పై కూడా కసరత్తు జరుగుతోందట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇస్తానని కిరణ్ అబ్బవరం ఇటీవల వెల్లడించాడు. దీంతో అతడి డైరెక్షన్ డెబ్యూపై ఆసక్తి నెలకొంది.

కార్తికేయ గుమ్మకొండ కూడా అదే బాటలో..

రామ్, కిరణ్ అబ్బవరం బాటలోనే మరో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ కూడా అడుగులు వేస్తున్నాడు. ‘భజే వాయు వేగం’ తర్వాత కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఇటీవల వెల్లడించాడు.

తన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్ టైటిల్‌ను కూడా ప్రకటించాడు. పవర్‌ఫుల్ టైటిల్‌తో ఈ సినిమాతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని కార్తికేయ చూస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం.

అంతేకాదు.. ఈ సినిమాకు కార్తికేయ రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంటే నటనతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టే దిశగా ఈ యంగ్ హీరో అడుగులు వేస్తున్నాడు.

మొత్తంగా టాలీవుడ్‌లో యంగ్ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా.. సినిమా మేకింగ్‌లోని వివిధ విభాగాల్లో తమ ప్రతిభను పరీక్షించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త ప్రయత్నాలు వారికి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *