వినాయక చవితి సందర్భంగా గణపతికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల్లో ఉండ్రాళ్ల పాయసానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, దీనిని తయారు చేయడం కాస్త కష్టమని చాలామంది భావిస్తుంటారు. కానీ సరైన కొలతలు పాటిస్తూ, కొన్ని సింపుల్ చిట్కాలను అనుసరిస్తే ఉండ్రాళ్ల పాయసాన్ని ఇంట్లోనే చాలా సులభంగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మరి గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల ఉండ్రాళ్ల పాయసం తయారు చేయడం చాలా కష్టమని అనిపించినా, సరైన కొలతలతో చేస్తే ఇంట్లోనే ఎంతో సులభంగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక కప్పు నీటిలో చిటికెడు ఉప్పు, రెండు టీస్పూన్ల పంచదార, ఒక టీస్పూన్ నెయ్యి వేసి మరిగించాలి. నీరు వేడెక్కిన తర్వాత బియ్యపు పిండి వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి. మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండ్రాళ్లుగా చేసుకోవాలి.
తర్వాత ఒక పాన్‌లో నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు పలుకులు, ఎండుకొబ్బరి ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నీటిని మరిగించి, సిద్ధం చేసుకున్న ఉండ్రాళ్లను వేసి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. అనంతరం పాలు పోసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. పాయసం చిక్కగా కావడానికి బియ్యపు రవ్వను వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తరిగిన బెల్లం వేసి పూర్తిగా కరిగే వరకు కలపాలి. బెల్లం కరిగిన తర్వాత మళ్లీ స్టవ్‌పై పెట్టి ఒకటి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ను నెయ్యితో సహా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే.. ఎంతో రుచికరమైన, నోరూరించే పాల ఉండ్రాళ్ల పాయసం సిద్ధం. వినాయక చవితి సందర్భంగా గణపతికి నైవేద్యంగా సమర్పించేందుకు ఇది చక్కని ప్రసాదం.
