హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పర్వదినాన శివపార్వతుల కుమారుడైన వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. స్వామివారికి పండ్లు, వివిధ రకాల సాంప్రదాయ మిఠాయిలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. అయితే వినాయకుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యాల్లో మోదక్‌ది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా ఉకడిచే మోదక్ ఎంతో రుచిగా, మృదువుగా ఉంటుంది. ఈ వినాయక చవితికి ఇంట్లోనే సులభంగా ఉకడిచే మోదక్‌లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మోదక్‌ల తయారీకి ముందుగా బియ్యం పిండి, నీరు, నెయ్యి, ఉప్పు సిద్ధం చేసుకోవాలి. పూరణం కోసం తాజాగా తురిమిన కొబ్బరి, తురిమిన బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.
మోదక్ పిండి తయారీ: ఒక పాత్రలో ఒక కప్పు నీటిని మరిగించి, అందులో చిటికెడు ఉప్పు, ఒక టీస్పూన్ నెయ్యి వేయాలి. నీరు బాగా మరిగిన తర్వాత బియ్యం పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. అనంతరం మంట ఆపి పాత్రపై మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి. పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని మెత్తగా కలపాలి. పిండి పొడిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీటిని చల్లి మెత్తగా చేసుకోవాలి.
కొబ్బరి-బెల్లం పూరణం: మరో పాన్‌లో ఒక టీస్పూన్ నెయ్యి వేసి తురిమిన కొబ్బరి, బెల్లం వేసి మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి. బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం మెత్తగా అయిన తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. అనంతరం పూరణాన్ని చల్లారనివ్వాలి.
మోదక్‌ల తయారీ: సిద్ధం చేసుకున్న బియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చేతితో పలుచగా ఒత్తాలి. మధ్యలో కొబ్బరి-బెల్లం పూరణాన్ని పెట్టి, చుట్టూ ఉన్న అంచులను మడతలుగా చేస్తూ మెల్లగా మోదక్ ఆకారంలోకి తీసుకురావాలి.
ఆవిరితో ఉడికించడం: ఇడ్లీ పాత్రలో నీటిని మరిగించి, నెయ్యి రాసిన ప్లేట్‌పై మోదక్‌లను అమర్చాలి. వీటిని సుమారు 15 నిమిషాల పాటు ఆవిరితో ఉడికించాలి. మోదక్‌లు బయటకు మెత్తగా, లోపల పూరణం బాగా సెట్ అయిన తర్వాత తీసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.
