సాయంత్రం వేళ ఆకలి వేయగానే చాలామంది చిప్స్‌, ప్యాకెట్‌ స్నాక్స్‌, ఇతర జంక్‌ ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే కొద్ది నిమిషాల్లో తయారు చేసుకునే ఆరోగ్యకరమైన స్నాక్‌ను ఎంచుకోవచ్చు. వేరుశెనగలు, ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీరతో తయారు చేసే ఈ సింపుల్‌ మిశ్రమం రుచిగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందిస్తుంది.

వేరుశెనగల్లో ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర వంటి కూరగాయల ద్వారా ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అందువల్ల సాయంత్రం వేళ చిరుతిండిగా దీన్ని మితంగా తీసుకోవచ్చు.

ఈ స్నాక్‌ తయారీకి ఒక కప్పు వేరుశెనగలు, 2 చిన్న ఉల్లిపాయలు, 3 టమోటాలు, 3–4 పచ్చిమిరపకాయలు, అర కప్పు కొత్తిమీర, 4 బాదం పప్పులు, 1 టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్‌ కారం, అర టీస్పూన్‌ జీలకర్ర పొడి అవసరం. అదనపు రుచికి కావాలనుకుంటే కొద్దిగా ఉడికించిన స్వీట్‌ కార్న్‌ను కూడా కలుపుకోవచ్చు.

తయారీ విధానం విషయానికి వస్తే.. ముందుగా బాణలిని వేడి చేసి, నూనె లేకుండా వేరుశెనగలను దోరగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించిన అనంతరం వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేయించిన వేరుశెనగలు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసి, రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి కలపాలి. అనంతరం సన్నగా తరిగిన కొత్తిమీరను జోడించి బాగా కలపాలి. మరింత రుచి, పోషకాల కోసం చిన్న ముక్కలుగా చేసిన బాదం పప్పులను కూడా కలుపుకోవచ్చు. చివరగా నిమ్మరసం పిండుకుని మొత్తం మిశ్రమాన్ని మరోసారి బాగా కలపాలి. ఇష్టపడితే కొద్దిగా ఉడికించిన స్వీట్‌ కార్న్‌ను కూడా జోడించుకోవచ్చు.

వేరుశెనగలు, బాదం ద్వారా ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. అలాగే ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర వంటి పదార్థాల ద్వారా ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. నూనెలో వేయించిన ప్యాకెట్‌ స్నాక్స్‌కు బదులుగా ఇలా ఇంట్లోనే తాజాగా తయారు చేసుకుని మితంగా తీసుకోవడం మంచి ఎంపికగా చెప్పొచ్చు.