
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ దర్శకుడు జితు మాధవన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సీన్’. ‘రొమాంచం’, ‘ఆవేశం’ వంటి సినిమాలతో తనదైన మేకింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తున్నారు. సూర్య కెరీర్‌లో 47వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలై మంచి ఆసక్తిని పెంచుతోంది.
గ్లింప్స్‌లో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్ అనే పోలీస్ అధికారిగా కనిపించారు. అయితే ఇది రెగ్యులర్ పోలీస్ క్యారెక్టర్ కాదనే విషయం వీడియో చూస్తేనే అర్థమవుతోంది. క్రైమ్ సీన్‌ను పరిశీలించే విధానం, తోటి పోలీసులతో వ్యవహరించే తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్.. అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నిబంధనలను పట్టించుకోకుండా తనదైన శైలిలో కేసులను డీల్ చేసే ఆఫీసర్‌గా సూర్య పాత్రను డిజైన్ చేసినట్లు గ్లింప్స్ సూచిస్తోంది.
ముఖ్యంగా కానిస్టేబుల్ భుజంపై చేయి వేసుకుని సూర్య చేసే స్టైలిష్ ఎంట్రీ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఇచ్చే వార్నింగ్‌తో పాత్రలోని కాన్ఫిడెన్స్, అగ్రెషన్ మరింత స్పష్టమవుతుంది. సూర్య తన హావభావాలు, డైలాగ్ డెలివరీతో ఇన్‌బరాజ్ పాత్రకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
జితు మాధవన్ గత చిత్రాల తరహాలోనే ‘సీన్’లోనూ యాక్షన్‌తో పాటు కామెడీ, డార్క్ హ్యూమర్‌కు ప్రాధాన్యం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లింప్స్‌లోనే పోలీస్ పాత్రను కొంత విచిత్రంగా, మరికొంత ఫన్నీగా చూపించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. సూర్య మాస్ ఇమేజ్‌కు జితు మాధవన్ స్టైల్ కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఈ సినిమాలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. మలయాళ నటుడు నస్లెన్‌తో పాటు జాన్ విజయ్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నజ్రియాకు సూర్యతో ఇది తొలి కాంబినేషన్ కావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
టెక్నికల్‌గానూ ‘సీన్’కు మంచి టీమ్ పనిచేస్తోంది. సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తుండగా, వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. జితు మాధవన్‌తో ‘ఆవేశం’కు పనిచేసిన సుషిన్ శ్యామ్.. ఈ సినిమాతో తొలిసారి తమిళ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మంచి ఎనర్జీని ఇచ్చింది.
జ్యోతిక, సూర్య నిర్మాణంలో జఘరం స్టూడియోస్, 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ‘సీన్’ థియేటర్లలోకి రానుంది.
ఇక 2026లో సూర్యకు ఇది మూడో విడుదల కానుంది. ‘సీన్’ గ్లింప్స్‌లో కనిపించిన విభిన్న పోలీస్ పాత్ర ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న నేపథ్యంలో.. జితు మాధవన్ తన మార్క్ ట్రీట్‌మెంట్‌తో సూర్యను ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
