
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. త్వరలోనే ప్రజలు సరైన తీర్పు ఇస్తారని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విలువ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్లీ అర్థమవుతుందని అన్నారు. 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దీనిని కూటమి సహా ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఆత్మపరిశీలన ప్రారంభమైందని నాని పేర్కొన్నారు. జగన్‌ను అనవసరంగా దూరం చేసుకున్నామనే భావన ప్రజల్లో పెరుగుతోందని, ముఖ్యంగా పేద వర్గాలు ఆయన నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నాయని చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న వారు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. కుటుంబ అంశాలను రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని అన్నారు.
వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై మాట్లాడుతూ, తన సొంత ఆస్తిలో కూడా భాగస్వామ్యం కల్పించిన నాయకుడు అని ప్రశంసించారు. తన చెల్లెళ్ల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడకపోయినా, ఆయనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదాన్ని ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వానికి అది పెద్ద దెబ్బగా మారిందని నాని వ్యాఖ్యానించారు. దేవుడి దయతో, ప్రజల మద్దతుతో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేస్తూ, ఆయన ఇచ్చిన హామీలను మాత్రమే కాదు, మేనిఫెస్టోలో లేనివాటినీ అమలు చేసిన నాయకుడని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
2014 ఎన్నికల సందర్భాన్ని ప్రస్తావిస్తూ, చంద్రబాబు నాయుడు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను, పేర్ని నాని కూడా అలాంటి హామీ ఇవ్వాలని జగన్‌ను కోరామని, అయితే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్ ఆ ఆలోచనను తిరస్కరించారని చెప్పారు. భారీ వ్యయం అవసరమయ్యే హామీలను అమలు చేయడం సాధ్యం కాదని అప్పుడే జగన్ స్పష్టం చేశారని పేర్కొన్నారు.
అయితే చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటు వేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. 2019లో ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి జగన్‌కు మద్దతు ఇచ్చారని అన్నారు.
జగన్ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని, కరోనా సమయంలో కూడా పేదల కోసం పనిచేశారని నాని ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో కూటమి అధిక హామీలతో ప్రజలను ఆకర్షించిందని, అదే జగన్ ఓటమికి కారణమైందని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ఆ హామీలను అమలు చేయడంలో కూటమి విఫలమవుతోందని, ఆ పార్టీల నేతలే తమ నాయకత్వంపై విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొడాలి నాని అన్నారు. త్వరలోనే ప్రజలు నిజాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

