
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్న నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. ఈ వ్యవహారంలో 13 మంది నేవీ సిబ్బందితో పాటు 18 మంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’లో భాగంగా 12 బృందాలుగా ఏర్పడి దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నానికి చెందిన కాంట్రాక్టు డ్రైవర్ అన్నం సాయివరప్రసాద్, కోయంబత్తూరుకు చెందిన నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని అరెస్టు చేశారు.
డబ్బు కోసం విశాఖలోని కీలక రక్షణ స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ చానళ్ల ద్వారా పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి పలు ఆధారాలను సేకరించడంతో పాటు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషిస్తున్నారు. మిగిలిన అనుమానితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే మూడు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
