
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం లోక్‌సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్.. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం రెండు గంటల పాటు టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన సహా వివిధ పార్టీల సభ్యులు బిల్లుపై చర్చించారు. ఆ తర్వాత అమరావతి బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్దతిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. గురువారం రోజున ఈ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకురానుంది.
మరోవైపు అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. అమరావతి ఆంధ్రుల కలల రాజధానిగా అభివర్ణించారు. అమరావతి కోసం భూములను త్యాగం చేసిన రైతులకు అభినందనలు తెలియజేశారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలన్న పెమ్మసాని చంద్రశేఖర్.. అమరావతి ఉద్యమంలో పోరాడిన మహిళలకు అభినందనలు తెలిపారు. వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం.. మూడు ప్రాంతాల నడుమ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అమరావతి రైతులు, మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయని పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందా? అనే అనుమానానికి ఈ చట్టసవరణతో ముగింపు పలకాలని అన్నారు.

