ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను పరిశీలించారు.

తుఫాన్ కదలికలు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ఆర్టీజీఎస్ అధికారులు సీఎంకు వివరించారు. వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందా అని చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారులతో పాటు ఇతర మార్గాల్లో కూలిన చెట్లను వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని సూచించారు.

తుఫాన్ హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వివరించారు. మనమిత్ర యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేస్తూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

మరోవైపు రాత్రి నుంచి ఉదయం వరకు చంద్రబాబు అధికారులు వివిధ శాఖల సిబ్బందితో మాట్లాడి సహాయక చర్యలపై సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండల గ్రామ స్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. స్వయంగా సీఎం క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడుతుండటంతో అధికారులు మరింత సమన్వయంతో పనిచేస్తున్నారు.

రాత్రి నుంచే సిబ్బంది రోడ్లపై ఉండి తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కూలిన చెట్లను తొలగించే పనులను విద్యుత్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు చేపట్టారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ఇతర అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ అధికారులు రోడ్లపై ఉండి సహాయక చర్యలను కొనసాగించారు. వాట్సాప్, సోషల్ మీడియా, మీడియా, కంట్రోల్ రూమ్‌ల ద్వారా అందుతున్న సమాచారం ఫిర్యాదులపై సంబంధిత శాఖల సిబ్బంది తక్షణమే స్పందించారు.

ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించడంతో విద్యుత్ పునరుద్ధరణ రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు వంటి పనుల్లో ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. మరోవైపు మంత్రులు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు అవసరమైన సేవలను త్వరగా పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *