
తిరుమల శ్రీవారి ఆలయంలోని పురాతన శాసనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘భారత్-శ్రీ’ ప్రాజెక్టులో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో ఆలయ పరిధిలోని సుమారు 750 శాసనాలను డిజిటలైజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఏఎస్ఐ ఎపిగ్రఫీ డైరెక్టర్ డాక్టర్ కె.ఎం.రెడ్డి తెలిపారు.
శాసనాల నకళ్లను సేకరించేందుకు బ్రిటిష్ కాలం నాటి విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా శాసనాలు ఉన్న గోడలపై ప్రత్యేక కాగితాన్ని తడిపి అతికించి, ఇండియన్ ఇంక్‌తో అక్షరాల ముద్రలను తీస్తారు. అనంతరం వాటిని స్కాన్ చేసి డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.
గతంలో 1889, 1904, 1912, 1916 సంవత్సరాల్లో రెండో ప్రాకారంలోని 44 శాసనాల నకళ్లను, 2008–09లో ఆనంద నిలయం గోడలపై ఉన్న మరో 53 శాసనాల నకళ్లను సేకరించారు. ప్రస్తుతం మిగిలిన సుమారు 600 శాసనాల సేకరణపై అధికారులు దృష్టి సారించారు.
తిరుమల ఆలయ సామాజిక, మత, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రకు ఈ శాసనాలు కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి. డిజిటలైజేషన్ ద్వారా ఈ చారిత్రక సంపదను భవిష్యత్ తరాలకు భద్రపరచడంతో పాటు పరిశోధకులకు అందుబాటులోకి తీసుకురావచ్చు.
