
భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ సంస్థ DSS ఇమేజ్‌టెక్.. కెనడాకు చెందిన ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ అభివృద్ధి చేసిన ‘TULSA-PRO’ టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టింది. ఈ అత్యాధునిక చికిత్సా విధానాన్ని అందిస్తున్న తొలి కేంద్రంగా మాత్రమే కాకుండా, ప్రస్తుతం దక్షిణాసియాలోనే ఈ సదుపాయం కలిగిన ఏకైక కేంద్రంగా సికింద్రాబాద్‌లోని KIMS హాస్పిటల్స్ నిలిచింది.
ఈ విధానంలో MRI మార్గదర్శకత్వంతో రేడియేషన్ అవసరం లేకుండా, శస్త్రచికిత్స కోతలు చేయకుండానే చికిత్స అందిస్తారు. మూత్రనాళం ద్వారా అల్ట్రాసౌండ్ శక్తిని పంపించి, ప్రోస్టేట్‌లోని వ్యాధిగ్రస్త కణజాలాన్ని లక్ష్యంగా చేసుకుని ఖచ్చితత్వంతో తొలగించడం దీని ప్రత్యేకత. తద్వారా చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలిగే అవకాశాన్ని తగ్గించడమే ఈ సాంకేతికత లక్ష్యం.
మెరుగైన జీవన నాణ్యత.. వేగవంతమైన కోలుకోలు:
TULSA-PRO చికిత్సా విధానం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స పొందే రోగుల్లో మూత్ర నియంత్రణ (Continence), అంగస్తంభన సామర్థ్యం (Erectile Function) వంటి కీలక శారీరక విధులను సాధ్యమైనంతవరకు కాపాడుకోవచ్చని DSS ఇమేజ్‌టెక్ మెడికల్ డివిజన్ బిజినెస్ హెడ్ అనీష్ కౌశల్ తెలిపారు. దీనివల్ల చికిత్స అనంతరం రోగులు మెరుగైన జీవన నాణ్యతను పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అమెరికా FDA ఆమోదం పొందిన ఈ సాంకేతికతలో దుష్ప్రభావాల ముప్పు తక్కువగా ఉండటంతో పాటు, రోగులు త్వరగా కోలుకుని సాధారణ దైనందిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు వీలుంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో పురుషులు ప్రోస్టేట్ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న TULSA-PRO వంటి ఆధునిక చికిత్సా విధానాల గురించి వైద్య నిపుణులను సంప్రదించి, తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
