
పనిచేసే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయని నాయకులకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా అభివృద్ధి చేసిన వారిని గుర్తించి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీ మూడో వార్డులోని మొదటి పోలింగ్ బూత్‌లో నందమూరి బాలకృష్ణ తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని బాలకృష్ణ అన్నారు. అందుకే ఓటర్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు సమానమేనని ఎమ్మెల్యే అయినా సామాన్య పౌరుడైనా ఓటు విలువ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సామాన్య ఓటర్లతో కలిసి క్యూ లైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.
