ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అండగా నిలిచింది. తుఫాన్ సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించడం విశేషం.

ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఎస్‌బీఐ యాజమాన్యం, ఉద్యోగులను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, జీఎం కుందన్ జ్యోతి, ఏజీఎం షేక్ షమీన్ బాను పాల్గొన్నారు.

తుఫాన్ సహాయక చర్యలపై సీఎం సమీక్ష

మరోవైపు అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌తో పాటు విద్యుత్, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

నవంబర్ 2, 3, 4 తేదీల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *