
రాప్తాడు హైస్కూలులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినికి అన్ని శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం బాలికను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)కు తరలించి, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.
బాలిక త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ చేసిన ప్రార్థనలు ఫలిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. చికిత్సలో కీలకమైన దశ విజయవంతంగా పూర్తికావడం ఎంతో ఊరటనిచ్చిందన్నారు. చిన్నారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
విద్యార్థిని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ చిరునవ్వులు చిందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా విద్యార్థినిని పరామర్శించేందుకు మంత్రి నారా లోకేశ్ ఆదివారం బెంగళూరుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఓల్డ్ హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రికి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.
ఆమెకు అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. బాలిక త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరనున్నారు. అనంతరం విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.
